
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: గత పాలకుల వలె మాటలకే పరిమితం కాకుండా, ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజా ప్రభుత్వ పాలన ఈ విధంగా ఉంటుందని నిరూపించుకుంటున్నామని, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఎంపీడీవో కార్యాలయావరణలో మండలానికి చెందిన దాదాపు 908 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్ పథకంలో అవినీతికి తావు లేకుండా, రాజకీయ నాయకులైన, అధికారులైనా పెన్షన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఎవర్ని కూడా సహించేది లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం, రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తిరిగి తిరిగి ప్రజలు నరకయాతన అనుభవించారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళను అందివ్వడం జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రైతులకు రుణమాఫీ, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 కు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
మహిళలకు త్వరలో రూ. 2500 ఇస్తాం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు 2500 త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని, అలాగే మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.
మండలంలోని అన్ని రోడ్లు తప్పకుండా వేయించే బాధ్యత నేను తీసుకుంటాను : మండల కేంద్రంలోని నిరుపయోగంగా ఉన్న అన్ని రోడ్లను తప్పకుండా వేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోట్ పల్లి ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సారించి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే మండల కేంద్రంలోని దాదాపు 14 గ్రామాల రైతులకు సాగునీటి ప్రయోజనం చేకూరుతుందని, రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలో మహిళ స్వయం సహాయక సంఘాలకు భవనాలు, పాఠశాలలకు ప్రహరీ గోడలు, గ్రామపంచాయతీ భవనాలను మంజూరు చేయడం జరిగిందని, ఆయా పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తూ, వారి ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని, తాండూర్ నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా యొక్క ఏకైక లక్ష్యం అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

