TELANGANA DECCAN
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 2:08 pm Posted by : TELANGANA DECCAN

కార్తీక పౌర్ణమి వేళ.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

.  త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు.. సంగమేశ్వరునికి భక్తుల పూజలు 

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉదయం నుండే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యాలాల్ మండలం కోకట్ గ్రామ శివారులలో మూడు నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమం వద్ద వెలసిన ప్రసిద్ధ సంగమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడం విశేష ఆధ్యాత్మికత ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు నదుల సంగమ ప్రదేశంలో స్నానమాచరించి, సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసంతో తాండూర్ పట్టణం నుండి, చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగగా, భక్తుల రాకతో పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా తాండూర్ పట్టణంలోని పలు ఆలయాలు సైతం భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొని భక్తులు దీపారాధనలు నిర్వహించి, కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొన్నారు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో తాండూర్ ప్రాంతమంతా శివనామ స్మరణతో ఆధ్యాత్మికత నెలకొంది.